స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే బర్తరఫ్ చేయాలి : దళిత జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్

సెప్టెంబర్, 08 (V PRIME NEWS స్టేట్ బ్యూరో):
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను దళిత జర్నలిస్ట్ ఫోరం (DJF) రాష్ట్ర నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్, రాష్ట్ర అధ్యక్షులు తలారి యాదగిరి, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు రాపాక విజయరాజు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామని అశోక్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ పై బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం శాసన వ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలకు అవకాశం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలకు తావు ఉండకూడదని కాశపోగు జాన్ స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్ధ పదవుల ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజా ప్రతినిధిపై ఉందన్నారు. తాతా మధు వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం,సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజాప్రతినిధులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని కాపాడుతూ రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కాశపోగు జాన్ సూచించారు.
