సంగారెడ్డి

సంగారెడ్డిలో మాల విద్యార్థి నిరుద్యోగ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

అక్టోబర్ 4న ఉస్మానియా యూనివర్సిటీలో మహాసభ.. విద్య, ఉపాధి, రిజర్వేషన్లపై చర్చ

సంగారెడ్డి సెప్టెంబర్ 20, (V PRIME NEWS):

సంగారెడ్డి సెప్టెంబర్ 20, (V PRIME NEWS): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మాల స్టూడెంట్స్ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించనున్న మాల విద్యార్థి, నిరుద్యోగ మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. తలారి సురేష్, కరుణాకర్, సోషల్ మీడియా ఇన్‌చార్జి పురుషోత్తం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మాల జాతి సలహాదారు అనంతయ్య, ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, మాల మహానాడు అధ్యక్షుడు అందోల్ మల్లేశం పోస్టర్‌ను ఆవిష్కరించారు.
మహాసభను విజయవంతం చేయాలని పిలుపు
ఈ సందర్భంగా రాష్ట్ర మాల విద్యార్థి జేఏసీ చైర్మన్ పండుగ భాను తేజ మాట్లాడుతూ అక్టోబర్ 4న ఆదివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న మాల విద్యార్థి, నిరుద్యోగ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజాసంఘాలు, మాల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
రిజర్వేషన్లు, రోస్టర్ విధానంపై ప్రధాన చర్చ
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానం అమలులోకి వచ్చిన అనంతరం మాల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను మహాసభలో ప్రధానంగా చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రిజర్వేషన్ అవకాశాలు, ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ విధానం, విద్యా, ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.
25 నోటిఫికేషన్లపై నిర్వాహకుల ఆరోపణ
ఇప్పటివరకు వెలువడిన 25 నోటిఫికేషన్లలో రోస్టర్ విధానం కారణంగా మాల వర్గానికి అన్యాయం జరిగిందని నిర్వాహకులు ఆరోపించారు. సుమారు 19 నోటిఫికేషన్లలో ఒక్క పోస్టు కూడా కేటాయించకుండా ‘జీరో’ చూపించారని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ఉద్యోగ నియామకాల్లో సామాజిక న్యాయం, రిజర్వేషన్ హక్కులు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రముఖులు హాజరు
ఈ మహాసభకు ప్రొ. హరగోపాల్, కంచె ఐలయ్య, ప్రొ. కోదండరాం, ప్రొ. లింబాద్రి, గంటా చక్రపాణి, మల్లేపల్లి లక్ష్మయ్య తదితర ప్రముఖులు, మేధావులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మాల సంఘాల నాయకులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సామాజిక న్యాయం కోసం అందరూ పాల్గొనాలి
విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, సామాజిక న్యాయాన్ని కోరుకునే అన్ని వర్గాల ప్రజలు మహాసభలో పాల్గొని తమ సమస్యలను చర్చా వేదికపై ప్రస్తావించాలని పండుగ భాను తేజ కోరారు. హక్కులు, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం నిర్వహిస్తున్న ఈ మహాసభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నందాకిషోర్, రవీందర్ టీచర్, పుందరికం, మధుసూదన్, స్వతంత్రం, రాములు, సాధానందం, ఆత్మబంధవ్ ప్రేమ్ రాజ్, అరవింద్, సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

(Journalist – Rapaka VijayaRaju)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *