రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సదాశివపేట ఏవో
ఎరువుల దుకాణానికి ఇబ్బందులు కలిగించకుండా ఉండేందుకు రూ.30 వేలు డిమాండ్.. గతంలోనే రూ.10 వేలు స్వీకరణ

సంగారెడ్డి, నవంబర్ 3 |V PRIME NEWS: ఎరువుల వ్యాపారం నిరాటంకంగా కొనసాగేందుకు లంచం డిమాండ్ చేసిన సదాశివపేట మండల వ్యవసాయ అధికారి (ఏవో) జి. రమేష్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మంగళవారం తన కార్యాలయంలో రూ.20 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
రూ.30 వేలు డిమాండ్.. ఇప్పటికే రూ.10 వేలు చెల్లింపు
ఫిర్యాదుదారుడి అల్లుడు నిర్వహిస్తున్న ఎరువుల దుకాణం వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా చూసేందుకు ఏవో రమేష్ మొత్తం రూ.30 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 19న ముందస్తుగా రూ.10 వేలు తీసుకున్నారు. మిగిలిన రూ.20 వేలు మంగళవారం తన కార్యాలయంలో స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ కోర్టుకు నిందితుడి తరలింపు
ప్రభుత్వ విధులను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై ఏవో రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని హైదరాబాద్‌లోని రెండో అదనపు ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.
V PRIME NEWS
