ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ వైద్య సేవలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష
ఎంఎన్‌జే, నిమ్స్ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలపై ఆరా.. జిల్లాల్లో కీమోథెరపీ కేంద్రాల బలోపేతానికి చర్యలు.. క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపుపై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్, నవంబర్ 03 | V PRIME NEWS తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ రోగులకు అందుతున్న వైద్య సేవలను మరింత మెరుగుపరిచే దిశగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
ఎంఎన్‌జే, నిమ్స్ ఆసుపత్రుల సేవలపై ఆరా
ఈ సమావేశంలో ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి, నిమ్స్‌లో క్యాన్సర్ రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, చికిత్సా విధానాలు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై అధికారులు మంత్రికి వివరించారు. అలాగే జిల్లాల్లో ఏర్పాటు చేసిన కీమోథెరపీ కేంద్రాల పనితీరు, రోగులకు అందుతున్న సేవలు, ఎదురవుతున్న సమస్యలపై మంత్రి ఆరా తీశారు.
క్యాన్సర్‌ను నోటిఫయబుల్ వ్యాధిగా గుర్తించిన ప్రభుత్వం
క్యాన్సర్ వ్యాధి నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల క్యాన్సర్‌ను నోటిఫయబుల్ డిసీజ్‌గా ప్రకటించింది. వ్యాధి వివరాలను సమగ్రంగా నమోదు చేసేందుకు క్యాన్సర్ రిజిస్ట్రీతో పాటు ప్రత్యేక పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. దీనివల్ల రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల వివరాలు సేకరించడం, వ్యాధి వ్యాప్తిని అంచనా వేయడం, భవిష్యత్ వైద్య ప్రణాళికలు రూపొందించడం మరింత సులభం కానుంది.
స్క్రీనింగ్, నివారణకు ప్రత్యేక కార్యాచరణ
క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు విస్తృత స్థాయిలో స్క్రీనింగ్ కార్యక్రమాలు చేపట్టడం, ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య సదుపాయాలను బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించారు. క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు జిల్లాల స్థాయిలోనే మెరుగైన చికిత్స అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని అధికారులు, వైద్య నిపుణులు వివరించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, ఇతర ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు.
— V PRIME NEWS
Journalist – Rapaka VijayaRaju
