కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైన విద్యార్థులకు పరామర్శ
42 మంది విద్యార్థుల అస్వస్థతకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ అధ్యక్షులు బంగారు కృష్ణ
సదాశివపేట, సెప్టెంబర్ 18 (V PRIME NEWS):

సదాశివపేట, సెప్టెంబర్ 18 (V PRIME NEWS): కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ అధ్యక్షులు బంగారు కృష్ణ పరామర్శించారు. శుక్రవారం సదాశివపేట శివారులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లిన ఆయన, చికిత్స పొందుతున్న విద్యార్థులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలిసి విద్యార్థులకు అందుతున్న వైద్యం, వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
కలుషిత ఆహారం సరఫరాపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
ఈ సందర్భంగా బంగారు కృష్ణ మాట్లాడుతూ అభం శుభం తెలియని చిన్నారులకు నాణ్యత లేని ఆహారం అందించడం వల్ల 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం ఆందోళనకరమన్నారు. విద్యార్థులకు కలుషిత ఆహారం అందించి వారి అనారోగ్యానికి కారణమైన ఉపాధ్యాయుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యమైనదో కాదో పరిశీలించకుండా అనుమతి ఇచ్చిన ప్రిన్సిపాల్‌పై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆహార నాణ్యతపై కఠిన నిబంధనలు అవసరం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆహారం సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం మరింత కఠినమైన నియమ నిబంధనలు రూపొందించాలని బంగారు కృష్ణ కోరారు. ఆహారం నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి, విద్యార్థుల ప్రాణాలకు పూర్తి రక్షణ కల్పించాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్. వేణుగోపాల్, తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ కార్యదర్శి చింతల సాయి కుమార్, మహిపాల్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
(Journalist – Rapaka VijayaRaju)
