నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
రైతులకు విద్యుత్ సరఫరా మెరుగుపర్చాలి.. తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి
పెండింగ్ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి
సంగారెడ్డి, అక్టోబర్ 08 (V PRIME NEWS)

సంగారెడ్డి, అక్టోబర్ 08 (V PRIME NEWS):
సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దృష్టికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీసుకెళ్లారు.
గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పట్టణాలు, వివిధ మండలాల్లో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల అవసరాలు, పెండింగ్ అభివృద్ధి పనులపై కలెక్టర్‌తో విస్తృతంగా చర్చించారు. రైతుల విద్యుత్ సమస్యపై ప్రత్యేకంగా ప్రస్తావన నియోజకవర్గంలోని రైతులు విద్యుత్ కోతల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కనీసం 8 గంటల విద్యుత్ కూడా సక్రమంగా అందకపోవడంతో సాగు పనులకు ఆటంకం కలుగుతోందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు అవసరమైన విద్యుత్ సరఫరా సక్రమంగా జరిగేలా సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
ప్రజల తాగునీటికి మొదటి ప్రాధాన్యత
నియోజకవర్గంలోని పలు గ్రామాలు, ప్రాంతాల్లో తాగునీటి సమస్య నెలకొన్న నేపథ్యంలో పరిశ్రమలకు నీటి సరఫరా కంటే ప్రజల తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. తాగునీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, వేసవిలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
అంబేద్కర్ భవనాల మంజూరుకు విజ్ఞప్తి
నియోజకవర్గంలోని అవసరమైన ప్రాంతాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన భవనాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. సామాజిక వర్గాల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.
అత్యవసర గ్రామాలకు రూ.21.50 లక్షలతో బోర్‌వెల్స్
తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న అత్యవసర గ్రామాల్లో బోర్‌వెల్స్ మంజూరు చేయాలని గతంలో ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పందించారు. అత్యవసర గ్రామాల్లో రూ.21.50 లక్షల వ్యయంతో బోర్‌వెల్స్ మంజూరు చేసినట్లు తెలిపారు. దీంతో తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న గ్రామాలకు కొంతమేర ఉపశమనం లభించనుంది.
అలాగే సంగారెడ్డి నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వివిధ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్‌ను కోరారు.
ఈ భేటీలో ధనపు కలెక్టర్ పాండు, మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
