హైదరాబాద్

విద్యా రంగంలో సంస్కరణలకు పెద్దపీట

పాలిటెక్నిక్‌ల ప్రైవేటీకరణ లేదు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 12, V PRIME NEWS: రాష్ట్ర విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలు, పాలిటెక్నిక్‌లలో మార్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శాసనసభలో స్పష్టత ఇచ్చారు. విద్యార్థుల్లో నెలకొన్న అనుమానాలు, అపోహలను తొలగిస్తూ ప్రభుత్వం విద్య, నైపుణ్యం, ఉపాధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆధీనంలోని పాలిటెక్నిక్‌లు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయని, వాటిని స్కిల్స్ యూనివర్సిటీతో అనుసంధానం చేయడం ద్వారా ఆధునిక సాంకేతిక విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్‌లను టాటా టెక్నాలజీస్ సహకారంతో ఆధునీకరిస్తున్నామని తెలిపారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో గత ప్రభుత్వం రూ.5,435 కోట్ల బకాయిలు వదిలివెళ్లిందని, తమ ప్రభుత్వం ఇప్పటివరకు 32 నెలల్లో రూ.3,488 కోట్లు చెల్లించిందని సీఎం వెల్లడించారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం చెల్లింపులు జరుగుతున్నాయని, నిజాయితీగా వివరాలు సమర్పించిన కళాశాలల బకాయిలను పరిశీలించి విడతల వారీగా చెల్లిస్తామని చెప్పారు.
విద్యాశాఖ బడ్జెట్‌ను మూడేళ్లలో రూ.7,554 కోట్ల మేర పెంచామని, 10,006 మంది ఉపాధ్యాయులను నియమించామని సీఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 86 వేల మేర పెరిగిందని, ప్రీ-ప్రైమరీ విద్యను ప్రారంభించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని వివరించారు.
“విద్య ఒక్కటే జీవితాల్లో వెలుగును తీసుకొస్తుంది. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది” అనే నమ్మకంతో ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలను తెలంగాణకు తీసుకొచ్చి రాష్ట్రాన్ని విద్యా రంగంలో రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *