సంగారెడ్డి

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీ

సేవాభావం, సమానత్వం, న్యాయం వంటి విలువలను ప్రజాపాలన దినోత్సవం గుర్తు చేస్తుంది: ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్

సంగారెడ్డి, సెప్టెంబర్ 17 (V PRIME NEWS):

సంగారెడ్డి, సెప్టెంబర్ 17 (V PRIME NEWS): తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గురువారం ఉదయం 9 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ జాతీయ గీతాన్ని ఆలపించారు.
జిల్లా ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో కొనసాగిందని తెలిపారు. అనంతరం సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో విజయవంతం కావడంతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమమే ప్రజాపాలన ప్రధాన లక్ష్యం
ప్రజలచేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజాపాలనలో భాగమని ఎస్పీ తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేయడంతో పాటు ప్రభుత్వ సేవలను ప్రతి ఇంటికీ చేరవేయడం ప్రజాపాలన ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు.
సేవాభావంతో విధులు నిర్వర్తించాలి
ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తొలిరోజు సమాజానికి సేవ చేయాలనే ఉత్సాహంతో విధుల్లో చేరినట్లుగానే, చివరి వరకు అదే సేవాభావాన్ని కొనసాగించాలని పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ సూచించారు. ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తూ తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు.
సమానత్వం, న్యాయం విలువలను గుర్తుచేసే రోజు
ప్రజల కోసం సేవాభావం, సమానత్వం, న్యాయం వంటి విలువలను ప్రజాపాలన దినోత్సవం ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తుందని ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. ప్రజల భద్రత, సంక్షేమం కోసం పోలీసు శాఖ మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ బి. రమేష్, ఇన్‌స్పెక్టర్లు నాగేశ్వర్ రావు, రామకృష్ణ రెడ్డి, రామునాయుడు, నగేష్, ఆర్‌ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, డానియేల్, ఎస్‌బీ, డీసీఆర్‌బీ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

(Journalist – Rapaka VijayaRaju)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *