మట్టి గణపతే మహా గణపతి
పర్యావరణ పరిరక్షణలో వాసవి మా ఇల్లు సేవలు అభినందనీయం
5016 మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టిన కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి, సెప్టెంబర్ 10, (V PRIME NEWS):
పర్యావరణ పరిరక్షణను లక్ష్యంగా చేసుకుని వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.
సంగారెడ్డి పట్టణంలో గత 18 సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వాసవి మా ఇల్లు సంస్థ ప్రతి సంవత్సరం “మట్టి గణపతే మహా గణపతి” అనే నినాదంతో మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా అందజేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది 5016 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు.
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన విగ్రహాలను గురువారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం వాసవి మా ఇల్లు సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు.
వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం సుమారు 5,000 మట్టి వినాయక విగ్రహాలను సంగారెడ్డి పట్టణ ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి పుల్లూరి ప్రకాష్, జిల్లా జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు బండారు యాదగిరి, సంస్థ ఉపాధ్యక్షులు మ్యాడమ్ రాధాకిషన్, ఆమేటి మహేందర్, కార్యదర్శి కొంపల్లి విద్యాసాగర్, సభ్యులు నామా భాస్కర్, జూలకంటి మల్లేశం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
