సంగారెడ్డి

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయాలి

జర్నలిస్టుల సమస్యలపై మంత్రి పొంగులేటికి TUWJ–IJU వినతి

సానుకూలంగా స్పందించిన మంత్రి.. అర్హులైన వారికి ఇంటి స్థలాలు ఇస్తామని హామీ

సంగారెడ్డి, అక్టోబర్ 27 (V PRIME NEWS)

సంగారెడ్డి, అక్టోబర్ 27 (V PRIME NEWS):
సంగారెడ్డి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయడంతో పాటు హెల్త్ కార్డులు, పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను తక్షణమే అందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ–IJU) సంగారెడ్డి జిల్లా శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించింది.

సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్ష సమావేశం అనంతరం TUWJ–IJU సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి నేతృత్వంలో యూనియన్ నాయకులు మంత్రిని కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా బండారు యాదగిరి మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే అర్హుల జాబితాను సిద్ధం చేసి, ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని కోరారు.

జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హెల్త్ కార్డులు అందుబాటులో లేకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు జర్నలిస్టులు, వారి కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు.

అలాగే, అర్హతలు ఉన్నప్పటికీ ఇంకా అక్రిడిటేషన్ కార్డులు అందని జర్నలిస్టులను గుర్తించి, వారికి కూడా వెంటనే కార్డులు జారీ చేయాలని మంత్రికి విన్నవించారు. ఈ మూడు ప్రధాన సమస్యలను పరిష్కరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు.

జర్నలిస్టుల వినతిపై మంత్రి సానుకూల స్పందన

జర్నలిస్టుల వినతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. హైదరాబాద్‌లోని జర్నలిస్టులకు త్వరలో ఇంటి స్థలాలు కేటాయించే ప్రక్రియ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారని, అనంతరం సంగారెడ్డి జిల్లాలోనూ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ కూడా సంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, వాటిని మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వేదికపై ఉన్నారు.

ఈ కార్యక్రమంలో TUWJ–IJU నాయకులు రాజు నాయక్, హెచ్‌ఎంటీవీ శ్రీనివాస్, బాలయ్య, శ్రీకాంత్, ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *