హైదరాబాద్

తెలంగాణను కమ్మేసిన కరువు మేఘాలు!

రాష్ట్రవ్యాప్తంగా 365 మండలాలు కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన

111 మండలాల్లో తీవ్ర కరువు.. మరో 254 మండలాల్లో మధ్యస్థ పరిస్థితులు

హైదరాబాద్‌, అక్టోబర్ 28 (V PRIME NEWS)

హైదరాబాద్‌, అక్టోబర్ 28 (V PRIME NEWS):
తెలంగాణ రాష్ట్రాన్ని కరువు పరిస్థితులు కలవరపెడుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, సుదీర్ఘ విరామాలతో కూడిన పొడి వాతావరణం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 111 మండలాలను తీవ్ర కరువు ప్రాంతాలుగా, మరో 254 మండలాలను మధ్యస్థ కరువు ప్రాంతాలుగా వర్గీకరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజూ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

17 శాతం తక్కువ వర్షపాతం

2026 జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు రాష్ట్రంలో సాధారణంగా 740.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, 615.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. దీంతో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 17 శాతం లోటు నమోదైంది. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఆశించిన స్థాయిలో ఏర్పడకపోవడం, వర్షాలు లేకుండా ఎక్కువ రోజులు గడవడం, ఎల్‌నినో ప్రభావం వంటి అంశాలు కరువు పరిస్థితులకు కారణమయ్యాయని ప్రభుత్వం పేర్కొంది.

రైతులకు ఊరట కల్పించే చర్యలు

కరువు ప్రభావిత మండలాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అర్హులైన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించడం, పంట రుణాల రీషెడ్యూల్‌కు చర్యలు తీసుకోవడం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. కేంద్రం నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు విడుదలైన తర్వాత అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం నేరుగా బ్యాంకు ఖాతాల్లో సాయం జమ చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి.

జాబితాలో లేని మండలాలపైనా నిఘా

ప్రస్తుతం కరువు జాబితాలో చోటు దక్కని మండలాల్లోనూ వర్షపాతం, పంటల పరిస్థితులు, భూగర్భ జలాల స్థాయిని అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు మరింత దిగజారితే అదనపు నోటిఫికేషన్‌ ద్వారా మరిన్ని మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా చేర్చే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత నోటిఫికేషన్‌ ఆరు నెలలపాటు అమల్లో ఉండనుంది.

తాగునీరు, సాగునీటిపై పెరుగుతున్న ఆందోళన

వర్షపాతం లోటు ప్రభావం జలాశయాల నీటి నిల్వలు, వ్యవసాయం, భూగర్భ జలాలపై పడుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు సకాలంలో సహాయం అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడం కీలకంగా మారింది. కరువు ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు రైతులకు ఎంతవరకు ఉపశమనం కలిగిస్తాయన్నది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
V PRIME NEWS | తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *