రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి
పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో రక్తదాన శిబిరం.. 32 యూనిట్ల రక్తం సేకరణ
విద్యార్థులకు పోలీసు విధులపై అవగాహన.. సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై ప్రత్యేక సూచనలు
సంగారెడ్డి, అక్టోబర్ 27 (V PRIME NEWS)

సంగారెడ్డి, అక్టోబర్ 27 (V PRIME NEWS): పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఆర్ముడ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రక్తదాన శిబిరం, ఓపెన్ హౌస్ కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది, పట్టణ యువత, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వివరాలను అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్ వెల్లడించారు.
32 యూనిట్ల రక్తం సేకరణ
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొన్న దాతల నుంచి మొత్తం 32 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు.
ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. మనం ఇచ్చే రక్తం ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కానందున రక్తదానానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని సూచించారు.
విద్యార్థులకు పోలీసు విధులపై అవగాహన
ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు పోలీసు శాఖ విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రతలో షీ టీమ్స్ పాత్ర, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పనితీరు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలను ఆయా విభాగాల సిబ్బంది వివరించారు.
మహిళలపై వేధింపులు జరిగినప్పుడు జిల్లా షీ టీమ్ నంబర్ 8712656772కు సమాచారం అందించాలని సూచించారు. మహిళలు షీ-సేఫ్ అప్లికేషన్‌ను వినియోగించుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 ద్వారా పోలీసుల సహాయం పొందాలని తెలిపారు.
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ
జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు పోలీసు శాఖ పనితీరుపై అవగాహన కల్పిస్తున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంటామని, వాటి నిర్మూలనలో జిల్లా పోలీసు శాఖకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, డీసీఆర్బీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సైబర్ సెల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్లు సదా నాగరాజు, నాగేశ్వర్ రావు, నగేష్, రవీందర్, పోలీసు వైద్యాధికారి డాక్టర్ జ్యోతి, ఆర్ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, శ్రీనివాస్ రావు, పోలీసు సిబ్బంది, బ్లడ్ బ్యాంకు ప్రతినిధులు రాజు, విజయ్, పట్టణ యువత తదితరులు పాల్గొన్నారు.
Journalist – Rapaka VijayaRaju
