జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరం విజయవంతం
జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం.. నిర్వాహకులను అభినందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి, అక్టోబర్ 15 (V PRIME NEWS)

సంగారెడ్డి, అక్టోబర్ 15 (V PRIME NEWS): జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి సన్రైజ్ ఆసుపత్రి, రథసారథి తెలుగు దినపత్రిక సహకారం అందించాయి. శిబిరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ నిర్వాహకులను అభినందించారు. నిత్యం పని ఒత్తిడితో విధులు నిర్వహించే జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే కుటుంబ సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
వైద్య నిపుణులతో ప్రత్యేక పరీక్షలు
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరంలో సన్రైజ్ ఆసుపత్రికి చెందిన వివిధ విభాగాల వైద్య నిపుణులు పాల్గొన్నారు. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఎముకలు, మెదడు, నాడీ సంబంధిత సమస్యలతో పాటు చిన్నపిల్లలు, మహిళలు, సాధారణ వైద్య విభాగాలకు చెందిన వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలు అందించారు. వివిధ రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించడంతో పాటు అందుబాటులో ఉన్న మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు.
జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న, పెద్ద దినపత్రికలు, కేబుల్ మీడియా, సామాజిక మాధ్యమాలకు చెందిన జర్నలిస్టులు తమ కుటుంబ సభ్యులతో కలిసి శిబిరంలో పాల్గొన్నారు.

జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే. ఫైసల్ మాట్లాడుతూ, యూనియన్ రాష్ట్ర శాఖ గతంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు. అదే స్ఫూర్తితో సంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి సహకరించిన సంస్థలు, వ్యక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ, రాష్ట్ర నాయకత్వం స్ఫూర్తితో జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ చొరవతో నిర్వహించిన ఈ శిబిరానికి సన్రైజ్ ఆసుపత్రి, రథసారథి తెలుగు దినపత్రిక సహకారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ సిద్దిఖ్ మాట్లాడుతూ, జర్నలిస్టుల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు.
సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చౌహాన్ మాట్లాడుతూ, నిర్వాహకులతో పాటు పలువురు సహకరించడంతో శిబిరం విజయవంతమైందని తెలిపారు. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సహకరించిన సన్రైజ్ ఆసుపత్రి, రథసారథి తెలుగు దినపత్రిక యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ, వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు అందించారని వివరించారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు అందించడం ద్వారా ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
పలువురు ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమంలో డీపీఆర్వో విజయలక్ష్మి, అదనపు డీపీఆర్వో ఏడుకొండలు, టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు జావిద్, ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఇతర నాయకులు కసిని శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, యాదవ రెడ్డి పాల్గొని నిర్వాహకులను అభినందించారు.
సన్రైజ్ ఆసుపత్రి అధినేత స్వామి గౌడ్, రథసారథి ఎండీ సంతోష్ గౌడ్, సాక్షి సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ బాల ప్రసాద్, ఆంధ్రప్రభ సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ రాజు, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు ప్రభాకర్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు మతీన్, మల్లేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ విల్సన్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్, కోశాధికారి సిద్ధూ జైన్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు నజీర్, సదాశివపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హాజీ, ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్, పవన్ పాల్గొన్నారు. అలాగే టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు రాపాక విజయరాజు, హిమాయత్, ఇర్షాన్, రాజేశ్వర్, దినేష్ నాయక్, శ్రీకాంత్, మహేష్ గౌడ్, కొండాపూర్ రమేష్ గౌడ్, సాక్షి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ – రాపాక విజయరాజు
