V PRIME NEWS
ప్రజల కోసం… ప్రజల గొంతుక!
పరిశోధనాత్మక జర్నలిజానికి రక్షణ కల్పించాలి
డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు

న్యూఢిల్లీ, నవంబర్ 03, V PRIME NEWS: డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (DPDP Act–2023) నిబంధనలను సవాల్ చేస్తూ దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విచారణాత్మక జర్నలిజానికి ప్రత్యేక మినహాయింపులు కల్పించాలని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (DNPA) పిటిషన్ దాఖలు చేసింది.
జర్నలిజానికి ఆటంకాలు కలగొద్దు
ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం వార్తల్లో వ్యక్తిగత సమాచారాన్ని ప్రచురించడానికి సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాల్సి వస్తే అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో అవకతవకలను వెలుగులోకి తీసుకురావడం కష్టమవుతుందని మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
రహస్య సమాచార వనరులకు ముప్పు
ముఖ్యంగా విచారణలో ఉన్న వ్యక్తులకు ముందుగానే సమాచారం అందితే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, జర్నలిస్టులకు సమాచారం అందించే రహస్య వర్గాల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని పిటిషన్లో పేర్కొన్నాయి. అలాగే వ్యక్తిగత సమాచారాన్ని తొలగించాలని కోరే నిబంధనలు వాస్తవ వార్తలను కూడా తొలగించాల్సిన పరిస్థితి తీసుకురావచ్చని అభ్యంతరం తెలిపాయి.
కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 17న తదుపరి విచారణ జరగనుంది.
గోప్యతతో పాటు మీడియా స్వేచ్ఛకు రక్షణ
ప్రజల వ్యక్తిగత గోప్యతను కాపాడటంతో పాటు, ప్రజా ప్రయోజనాల కోసం నిజాలను వెలికితీసే జర్నలిజానికి కూడా రాజ్యాంగ పరిరక్షణ ఉండాలన్నది ఈ పిటిషన్లో ప్రధాన వాదన.
Journalist – Rapaka VijayaRaju
