డిజెఎఫ్ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దామోదర
అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు.. మంత్రి దామోదర రాజనర్సింహకు ఆహ్వానం


సంగారెడ్డి, సెప్టెంబర్ 17 (V PRIME NEWS): దళిత జర్నలిస్టుల ఫోరం (డిజెఎఫ్) ఆధ్వర్యంలో అక్టోబర్ 7న సంగారెడ్డిలో నిర్వహించనున్న 11వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు. గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు రాపాక విజయరాజు, జిల్లా అధ్యక్షుడు రామని అశోక్ ఆధ్వర్యంలో డిజెఎఫ్ నాయకులు మంత్రిని కలిసి మహాసభలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా డిజెఎఫ్ రాష్ట్ర మహాసభల లక్ష్యాలు, నిర్వహణ, జర్నలిస్టుల సమస్యలు, ప్రధాన డిమాండ్లను నాయకులు మంత్రికి వివరించారు. పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్‌లోని పీఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మహాసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
దళిత జర్నలిస్టుల హక్కుల సాధనకు తీర్మానాలు
దళిత జర్నలిస్టుల హక్కుల సాధన, వారి సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం రాష్ట్ర మహాసభల్లో పలు తీర్మానాలు చేయనున్నట్లు డిజెఎఫ్ నాయకులు తెలిపారు. దళిత జర్నలిస్టుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కల్పించాలని కోరారు.
అలాగే దళిత జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, వారి పిల్లలకు ఉచిత విద్య, కుటుంబ సభ్యులకు పరిమితి లేని వైద్య సదుపాయం, ఉచిత బస్, రైలు పాసులు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అభయహస్తం కింద రూ.12 లక్షలు, అకాల మరణం చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, నిరుద్యోగ జర్నలిస్టులకు నెలకు రూ.15 వేల నిరుద్యోగ భృతి అందించాలని కోరారు.
సీనియర్ జర్నలిస్టులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం:
సీనియర్ దళిత జర్నలిస్టులకు నామినేటెడ్ పదవులతో పాటు ప్రెస్ అకాడమీ చైర్మన్, సభ్యులుగా అవకాశం కల్పించాలని డిజెఎఫ్ నాయకులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు జర్నలిస్టులు, మేధావులు, ప్రజా సంఘాలు సహకరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో డిజెఎఫ్ సలహాదారు మీనంపల్లి కిషన్ రావు, జిల్లా కార్యదర్శి ముక్కగల్ల యాదన్న, జిల్లా ఉపాధ్యక్షుడు దానం మోహన్, కోశాధికారి ఎర్రోళ్ల సంపత్ కుమార్, హెచ్. దాసు తదితరులు పాల్గొన్నారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో పాటు జిల్లా అధికారులు ఉన్నారు.
Journalist Rapaka VijayaRaju
