🚨 ఎడమ కంటికి బదులు కుడి కంటికి ఆపరేషన్!
వైద్య నిర్లక్ష్యంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సీరియస్.. సుమోటోగా కేసు స్వీకరణ
సిరిసిల్ల, అక్టోబర్ 6 (V PRIME NEWS):

సిరిసిల్ల, అక్టోబర్ 6 (V PRIME NEWS):
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కొమ్ము వెంకమ్మ కంటి శస్త్రచికిత్స విషయంలో తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఎడమ కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉండగా.. పొరపాటున కుడి కంటికి శస్త్రచికిత్స చేశారన్న ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుమోటోగా కేసు స్వీకరించింది.
సిరిసిల్లకు చెందిన వెంకమ్మకు కంటి చూపు సమస్య ఉండటంతో సెప్టెంబర్ 28న స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. వైద్యులు పరీక్షించిన అనంతరం ఎడమ కంటికి శస్త్రచికిత్స అవసరమని సూచించినప్పటికీ, ఆపరేషన్ అనంతరం కుడి కంటికి శస్త్రచికిత్స జరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ ఘటనపై వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకున్న మానవ హక్కుల కమిషన్.. ఆరోపణలు నిజమైతే వైద్య నిర్లక్ష్యం, రోగి భద్రత, శస్త్రచికిత్సకు ముందు తీసుకున్న సమ్మతి వంటి అంశాలపై తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది.
ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని (DM&HO) కమిషన్ సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధితురాలి వైద్య రికార్డులు, చేసిన శస్త్రచికిత్స వివరాలు, రోగి లేదా కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్న సమ్మతి, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి, ఘటనపై చేపట్టిన విచారణ వివరాలను నివేదికలో పొందుపరచాలని సూచించింది.
ఈ ఘటనపై అధికారిక విచారణ ప్రారంభం కావడంతో అసలు పొరపాటు ఎలా జరిగింది? బాధ్యత ఎవరిది? అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావాల్సి ఉంది.
Journalist – Rapaka VijayaRaju
